AP

ఎంపీ బెల్లాన దారెటు..?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. నాలుగో జాబితా మీద ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. అన్ని లెక్కలను, సర్వేలనూ ముందేసుకొని ఎవర్ని ఉంచాలో? ఎవర్నీ పక్కనపెట్టాలో? అన్నదానిపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సదరు సిట్టింగుల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఫోర్త్ లిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు బెల్లానకి అధిష్టానం ఏమని సంకేతాలు పంపింది..? దానిపై సదరు ఎంపీ ఏ అభిప్రాయంతో ఉన్నారు?

 

విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. గతంలో విజయనగరం జడ్పీ ఛైర్మన్ గా పని చేసిన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అది కూడా టీడీపీ కీలక నేత పూసపాటి అశోక్ గజపతిరాజుపై ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ వేవ్ లో విజయబావుటా ఎగరేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నో చెప్పిదంట.. ఆయన స్థానంలో ఇప్పటికే విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరవు పేరు కన్ఫర్మ్ అయిందంటున్నారు. దాంతో బెల్లాన పొలిటికల్ ఫ్యూచర్‌పై జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది.

 

మరి బెల్లానకి ఎంపీ టిక్కెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు..? ఎమ్మెల్సీని చేస్తారా? ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఇస్తారా..? లేకపోతే చీపురుపల్లి నుంచి పోటీ చేయిస్తారా..? విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎవరిని కదిపినా ఇదే మాట్లాడుతున్నారు. అయితే బెల్లాన మాత్రం మౌనవ్రతం పాటిస్తూ.. తన రాజకీయభవితవ్యంపై సన్నిహితుల దగ్గర కూడా ఏమీ మాట్లాడటం లేదంట. దాంతోఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. బెల్లాన సంగతేంటి , ఇంక రాజకీయ జీవితం ముగిసినట్లేనా అని చర్చించుకుంటున్నారు. వైసీపీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసినప్పుడల్లా బెల్లాన ప్రస్తావన ఏమైనా ఉందా అని వెతుక్కుంటున్నారు.

 

ముఖ్యంగా బెల్లాన కి ఎంపీ కాకపోతే ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ప్రకటిస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆయనకు ఆ నియోజకవర్గంలో బంధుగణం ఎక్కువగా ఉండడం.. గతంలో కొందరు అనుయాయులు దగ్గర వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని లీకులు ఇవ్వడం కూడా ప్రధానంగా ఆ వాదనను తెరమీదకి తెచ్చింది. తీరా చూస్తే ఈ స్థానం నుండి విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీను కూడా టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అధిష్టానం కూడా పరిగణనలోకి తీసుకుందని.. ఇప్పటికే ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, మజ్జి శ్రీనివాసరావులతో మాట్లాడిందన్న టాక్ నడిచింది. అయితే స్థానికులకే తప్ప బయటి వాళ్ళకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని అక్కడి వారు సంకేతాలు ఇవ్వడం.. పార్టీ సర్వేల్లో కూడా అదే తేలడంతో ఆ చర్చకి పుల్ స్టాప్ పడింది. దీంతో ఎచ్చెర్ల పొలిటికల్ స్క్రీన్‌పై బెల్లాన, మజ్జి పేర్లు మాయమయ్యాయి.

 

మరోవైపు ఎంపీ అభ్యర్ధి మార్పూ అన్న ప్రచారంతో.. ఈ సారి మజ్జి శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఆయనే వైసీపీ కొత్త అభ్యర్ధన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఎంపి స్థానంపై కన్నేసినప్పటికీ.. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది దక్కలేదు. ఈసారి మాత్రం అధిస్తానం ఆయన వైపే మొగ్గు చూపుతోందని.. బెల్లానకి టిక్కెట్ దక్కదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే మజ్జి శ్రీనివాసరావుని ఎంపి గా పోటీ చేయిస్తే.. జడ్పీ ఛైర్మన్ పదవిని మళ్ళీ బెల్లానకి కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ కూడా నడిచింది. బెల్లాన తన కొడుక్కి ఆ పదవి ఇవ్వాలని కోరారని. దానికి అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు.

 

అంతేకాదు చీపురుపల్లి టిక్కెట్ ఇవ్వాలని, గతంలో 2014 లో వైసీపీ కి అభ్యర్ధి లేకపోతే తానే పోటీ చేశానని బెల్లాన పార్టీ పెద్దలని అడిగారంటున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్సకి తనకి 5 వేల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ వచ్చిందని.. కాబట్టి మరొక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఆయనకి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే టీడీపీలోకి జంప్ అయ్యి చీపురుపల్లి టిక్కెట్ అడిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మొత్తమ్మీద జిల్లా మొత్తం బెల్లాన హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ ప్రచారాలను, ఊహాగానాలను పక్కన పెడితే అధిష్టానం స్పష్టమయిన హామీ ఇవ్వకపోతే బెల్లాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.