AP

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో విచారణకు కేసు లిస్టు అయింది. తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటీషన్ ఫిబ్రవరి 5న విచారణకు రానుంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

సునీత వర్సస్ అవినాష్: సుప్రీంలో కంప్యూటర్ జనరేటెడ్ లిస్టు ప్రకారం ఈ కేసు గురువారం ఈ ధర్మాసనం ముందు విచారణకు రావాల్సి ఉంది. తాజాగా విచారణ లిస్టులో కనిపించకపోవటంతో సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా గురువారం ధర్మాసనం ముందు మెన్షన్ చేసారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసును ఫిబ్రవరిలో వింటామని, తేదీ పైన స్పష్టత ఇస్తామని చెప్పారు. కాగా, కోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఉత్తర్వుల్లో ఈ కేసును ఫిబ్రవరి 5వ తేదీకి పోస్టు చేసినట్లు పేర్కొన్నారు.

బెయిల్ రద్దు చేయాలంటూ: గత ఏడాది జూలై 18న జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం వివేకా హత్యకేసులో జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్, కేసు డైరీని సీల్డ్ కవర్ లో సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో రెండు వారాల్లోపు సీబీఐ రిప్లై దాఖుల చేయాలని సూచించిన న్యాయస్థానం ఈ కేసును సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ఆ రోజు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు వాయిదా కోరటంతో కేసు విచారణ విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.

 

ఫిబ్రవరి 5కి వాయిదా: ఆ తరువాత కేసు లిస్టులో కనిపించినా తర్వాత డిలీట్ అవుతూ రావటంతో సునీత తరపు న్యాయవాదులు డిసెంబర్ 6న ధర్మాసనం ముందు మెన్షన్ చేసారు. దీంతో జనవరి 17న తదుపరి విచారణ తేదీ ఇచ్చి, ఆ రోజు డిలీట్ కాకుండా చూడాలని ఆదేశించింది. 17న రావాల్సిన కేసు స్టేటస్ లిస్టులో 18వ తేదీ అని కనపడటంతో న్యాయవాది లూధ్రా ఈ విషయాన్ని ధర్మానసం కు నివేదించారు. గురువారం కూడా కేసులో లిస్టులో కనిపించకపోవటంతో మరోసారి సిద్దార్ధ లూథ్రా ధర్మానసం ముందు మెన్షన్ చేసారు. దీంతో, తదుపరి విచారణ ఫిబ్రవరి 5న చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది.