TELANGANA

తెలంగాణలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు..

తాను రైతు బిడ్డనని.. వ్యవసాయం తమ సంస్కృతి అని ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోక్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్నరైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని రేవంత్ పేర్కొన్నారు.

 

భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని.. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయని రేవంత్ చెప్పారు. బ్యాంకు రుణాలు రాక.. ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు సరైన లాభాలు పొందలేకపోతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు అర్థం చేసుకోగలనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ పేర్కొన్నారు.

మరోవైపు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సహా పలు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటితో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది టాటా గ్రూప్.

 

దావోస్(Davos)లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. టాటా గ్రూప్ నకు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్ ట్రాన్సిట్ హబ్‌గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది. తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ కీలక భాగస్వామ్యం అందిస్తోందని సీఎం రేవంత్ ఈ సందర్బంగా చెప్పారు. వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న టాటా గ్రూప్‌నకు తగిన సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.