AP

ఏపీలో.. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు: షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం..!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.

 

ఈ నెల 25వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్ వెలువడేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా వంద సభలను నిర్వహించాలని ప్లాన్ చేసింది.

 

 

తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది.

 

ఈ పరిస్థితుల మధ్య ఎన్నికల తేదీలపై ఒక్కటొక్కటిగా అంచనాలు వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడుతుందని స్పష్టం చేశారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతాయని పేర్కొన్నారు.

 

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఒకే రోజున షెడ్యూల్ అవుతుందని అన్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయఢంకా మోగిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతారనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. లోక్‌సభలో బీజేపీ-ఎన్డీఏ సంఖ్యాబలం 350ని దాటుతుందని జోస్యం చెప్పారు. మోదీ సారథ్యంలో భారత్.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిందని అన్నారు.

 

రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలను గెలిచి మోదీకి బహుమతిగా ఇస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ పరిపాలన, ఆయన హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీని గెలిపిస్తాయని చెప్పారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా అదే పంథాలో సాగుతోందని అన్నారు.