టీడీపీకి ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాను ఇవాళ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి మూడేళ్లు కావస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం విశేషం.
విశాఖ ఉత్తరం సీటు నుంచి 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన గంటా శ్రీనివాసరావు.. ఆ తర్వాత పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి ఫిరాయిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మూడేళ్ల తర్వాత తిరిగి యాక్టివ్ అయిన గంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి దూకారు. అప్పటి నుంచి పలు నిరసనల్లో పాల్గొంటున్న గంటా శ్రీనివాస్.. ఇదే క్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు 2021 ఫిబ్రవరిలో రాజీనామా అస్త్రం ప్రయోగించారు.
విశాఖ స్టీల్ ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలోనే గంటా శ్రీనివాస్ తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లో సమర్పించారు. అయితే అది వెంటనే ఆమోదం పొందకపోవడంతో ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాంను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. అయినా ఆయన స్పందించలేదు. కానీ చివరికి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో ఈ వ్యవహారం వెనుక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది.
గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం వెనుక త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. టీడీపీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్ధిని గెలిపించుకునే మెజార్టీ లేకపోయినా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులపైనా స్పందించిన స్పీకర్ .. వారికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు