AP

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్ అందింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్‌ను మరోసారి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం అందించింది.

 

ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రసాద్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గాసును కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే.

 

అదే విధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. కాగా, ఏపీలో మరి కొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే, బీజేపీతో పొత్తుపై మాత్రం తేల్చుకోలేకపోతున్నాయి. తాము పొత్తులోనే ఉన్నామని మాత్రం బీజేపీ, జనసేన నేతలు చెబుతుండటం గమనార్హం.