AP

జనసేన రెండో జాబితా సిద్దం..

జనసేనాని పవన్ పోటీ చేసెదెక్కడ. జనసేన రెండో జాబితాలు విడుదల అయ్యేది ఎప్పుడు. పార్టీ ఆశావాహులు, అభిమానులు ఈ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. ఇదే అంశం పైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అందులో అయిదు స్థానాల్లో పవన్ తన అభ్యర్దులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో పది నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించేలా నిర్ణయించారు. తాను పోటీ చేసే స్థానం పైన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 

పవన్ పోటీ ఎక్కడ: టీడీపీ, జనసేన తమ తొలి జాబితాలో 99 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు. పవన్ తాను పోటీ చేసే స్థానం పైన నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత భీమవరం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇప్పుడు గాజువాక, పిఠాపురం, తాడేపల్లి గూడెంలో పవన్ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

 

ఇక, తొలి జాబితా ప్రకటన తరువాత సీట్లు రాని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో..టీడీపీ మిగిలిన 57 స్థానాలు..జనసేన ప్రకటించాల్సిన 19 స్థానాల పైన రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పెందుర్తి స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంఛార్జ్‌గా ఉండగా జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

రెండో జాబితాపై కసరత్తు: జనసేన ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో మెజార్టీ స్థానాలు కోరుతోంది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరులో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ గురించి ప్రచారంలో ఉన్నా టీడీపీనే అక్కడి నుంచి పోటీ చేస్తుందని చెబుతున్నారు.

 

పిఠాపురం, కాకినాడ అర్బన్, రూరల్ స్థానాలను జనసేన ఆశిస్తోంది. అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో అమలాపురం, రంపచోడవరం, రాజోలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ గతంలోనే ప్రకటించారు. అమలాపురం, రామచంద్రాపురం స్థానాల్నీ జనసేన ఆశిస్తోంది. నిడదవోలు, రాజమండ్రి రూరల్ జనసేనతో ముడిపడి ఉంది.

 

ఆశావాహుల్లో ఉత్కంఠ: నర్సాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా ఈ మూడు స్థానాల్ని జనసేన కోరుకుంటోంది. పోలవరం స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. ఉంగుటూరు అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఇంఛార్జ్‌గా ఉన్నారు.

 

ఈ స్థానం పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తోంది. విజయవాడ పశ్చిమం, గుంటూరు పశ్చిమం, అవని గడ్డ స్థానాల పైన జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి కొణతాల పేరు ఇప్పటికే ప్రకటించినా..అక్కడ మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. టీడీపీలోనూ తొలుత ప్రకటించిన జాబితాలో కొన్ని మార్పులు అవసరమే చర్చ వినిపిస్తోంది. దీంతొ..టీడీపీ – జనసేన రెండో జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.