TELANGANA

రైతు రుణ మాఫీపై సర్కార్ కసరత్తు..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు చాలా హామీలు ప్రకటించింది. అందులో రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు ప్రముఖంగా ఉన్నాయి. ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు జమ చేస్తున్నారు. వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.10 ఇస్తుండగా.. రైతు భరోసాలో భాగంగా ఎకరానికి రూ. 15 వేలు ఇవ్వనున్నారు.

 

గత బడ్జెట్‌‌లో రైతుబంధుకు రూ.15070కోట్లు కేటాయించారు. గత సర్కారు 54 ఎకరాల వరకు రైతుబంధు అమలు చేస్తూ వస్తోంది. అయితే కొత్త ప్రభుత్వం రైతు భరోసాకు పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు గైడ్లైన్స్ రూపొందించే పనిలో పడ్డారు. ఇదివరకు బీడు భూములు, రియల్‌‌ ఎస్టేట్‌‌ భూములు, ప్రాజెక్ట్‌‌ల కింద సేకరించిన భూములకు రైతు బంధు డబ్బులిచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు ఇచ్చారు. వ్యాపారులు, సినీ ప్రముఖులకు రైతు బంధు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

రైతు భరోసాకు పరిమితులు విధించాలని డిమాండ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇక రైతు రుణ మాఫీకి సంబంధించి సర్కార్ కసరత్తు చేస్తోంది. రైతు రుణ మాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. గత బడ్జెట్‌‌లో వ్యవసాయానికి రూ.26,831కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ఈ సారి అదనంగా మరో రూ.14వేల కోట్ల ప్రతిపాదనలు అధికారులు చేర్చారు. ఇందులో రైతు రుణ మాఫీ నిధులు లేవు. రుణ మాఫీ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

 

రైతు రుణ మాఫీ కటాఫ్ పై కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. గత సర్కారు చేస్తామని చెప్పిన రూ.లక్ష రుణమాఫీ దాదాపు రూ.22వేల కోట్ల వరకు ఉండగా ఇందులో రూ.13వేల కోట్ల వరకే మాఫీ చేసింది. మిగిలిన రుణమాఫీతో పాటు తాజాగా రూ.2లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపుపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రైతు రుణ మాఫీ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రుణ మాఫీ చేసే అవకాశం ఉంది.