AP

నేడు వైసీపీ అయిదో జాబితా..

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

 

నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం ఖరారు కావడం, తనను గుంటూరు లోక్‌సభకు బదలాయించడం వంటి కారణాల వల్ల లావు రాజీనామా చేయాల్సి వచ్చింది. గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయడం ఇష్టం లేకపోవడం వల్లే ఆయన బయటికెళ్లారని చెబుతున్నారు.

 

కృష్ణదేవరాయలు స్థానంలో అనిల్ కుమార్ యాదవ్‌ పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకు టికెట్ ఇస్తారని సమాచారం.

 

దీనిపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నెల్లూరులో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నిర్ణయం తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని, అది నరసరావుపేట లేక ఇంకో స్థానమా అనేది చూడనని అన్నారు.

 

రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందని, ఇక నరసరావుపేట ఎంపీగా ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటానని అన్నారు. నరసరావుపేట ఎంపీగా గెలిచిన చరిత్ర నెల్లూరు జిల్లా నాయకులకు ఉందని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

 

ఒక బీసీ నాయకుడికి నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జిల్లా చరిత్రలోనే తొలిసారి అని, ఇక నరసరావుపేట ఎంపీ స్థానంలో ఒక బీసికి అవకాశం ఇచ్చి జగన్ మరోసారి చరిత్రను తిరగ రాయనున్నారని చెప్పారు.

 

నరసరావుపేట ప్రజలు తనను గెలిపిస్తే ఢిల్లీలో ఏపీ గొంతుకను వినిపిస్తానని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. చంద్రబాబు చరిత్రను ఇక లోక్‌సభలో వినిపిస్తానని వ్యాఖ్యానించారు. భీమిలీలో జగన్ సింహనాదంతో ఎన్నికల యుద్ధం మొదలైందని, ఇది పేదలు- పెత్తందార్ల మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణించారాయన.