AP

అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాుల చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. అలాగే, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అయితే, టీడీపీతో బీజేపీ పొత్తుపైనే ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశం అయ్యారు.

 

అనంతరం బుధవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు, సీట్ల పంపకంపైనే వీరి భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలుస్తున్నారని చెప్పారు. అయితే, తనకు భేటీ వివరాలు తెలియవని అన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ టీడీపీ-బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ వీరికి మద్దతు తెలిపారు. దీంతో ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో వైయస్సార్సీపీకి రాజీనామా చేసిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నర్సరావుపేట నుంచి మరోసారి పోటీ చేసేందుకు వైసీపీ అవకాశం ఇవ్వని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిశారు లావు కృష్ణదేవరాయలు. అవకాశం ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేయాలనే తన కోరికను చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం.

 

ఢిల్లీ పర్యటనకు బయల్దేరే ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో తాజా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నేతలు కళా వెంకట్రావు, రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని నేతలతో అన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లాకే ఎందుకు పిలిచారు ఏంటి అనేది తెలుస్తుందని నేతలతో అన్నట్లు సమాచారం. అక్కడ సమావేశం అనంతరం, చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుగుదేశం నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.