National

‘భారత్ రైస్’ అమ్మకాలు నేటి నుంచే..

సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంగళవారం (ఫిబ్రవరి 8న) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

 

రూ. 29కే కేజీ భారత్ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(NCCF), కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల వద్ద తొలి విడతలో విక్రయించనున్నారు.

 

భారత్ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. కాగా, ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాలను విక్రయించడం గమనార్హం. ఇందులో భాగంగా గోధుమ పిండిని గత నవంబర్ 6న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

 

గోధుమ పిండి కిలో రూ. 27.50, భారత్ శనగ పప్పును రూ. 60 చొప్పున నాఫెడ్ బజార్.కాం(https://www.nafedbazaar.com/) తదితర ఈ కామర్స్ వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో భారత్ రైస్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను విక్రయాలను పెంచనున్నారు.