ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేసాయి. సీఎం జగన్ అభ్యర్దుల కసరత్తు తది దశకు చేరింది. టీడీపీ జనసేన సీట్ల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చినా..ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం పైన చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే అధికారికంగా సీట్ల ప్రకటన జరగనుంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.
పొత్తులు- సీట్లు : పొత్తులో భాగంగా జనసేనకు 25-27 సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు ఎంపీ స్థానాలు ఇస్తారని చెబుతున్నా..ఇప్పుడు మరో ఎంపీ స్థానం జనసేన కోరుతోంది. అందులో భాగంగా కాకినాడ, మచిలీపట్నంతో పాటుగా తాజాగా అనకాపల్లి స్థానం కోరుతోంది. ఇక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయటానికి సిద్దమైనట్లు జనసేన నేతలు చెబుతున్నానరు. ఈ స్థానం కోసం టీడీపీలో పోటీ నెలకొంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒక్క సీటు ఫార్ములా చంద్రబాబు అమలు చేస్తున్నారు. దీంతో, నర్సీపట్నం సీటు అయ్యన్నకు ఇవ్వనుండటంతో విజయ్ కు సీటు లేదని తేల్చేసారు.
జనసేనకు ఎంపీ స్థానాలు : దీంతో..సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది. టీడీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దలు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. పవన్ 35 సీట్లు కోరుతున్నా..25-27 మధ్యనే అసెంబ్లీ సీట్లు ఖాయం అయ్యే పరిస్థితులు ఉండటంతో..జనసేనకు మరో ఎంపీ స్థానం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీంతో అనకాపల్లి స్థానం కోరుతున్నట్లు సమాచారం.
ఎంపీగా నాగబాబు పోటీ : అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేసే క్రమంలోనే ఆయన విశాఖలో మకాం వేసారని తెలుస్తోంది. నాగబాబు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సుందరపు సతీశ్‌కుమార్ (యలమంచిలి అభ్యర్థి)ని సోమవారం రాత్రే జనసేన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధిగా నియమించారు. 2009లో ఇదే స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన అల్లు అరవింద్ 294,183 ఓట్లు సాధించారు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్, 2019లో వైసీపీ అభ్యర్ది సత్యవతి గెలుపొందారు. ఈ సారి జనసేన నుంచి మహిళా అభ్యర్దిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో నాగబాబు పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో సమీకరణాల పైన ఆసక్తి నెలకొంది.