AP

జనసేనకు ఏడు లోక్‌సభ స్థానాలు- అభ్యర్థులు వీళ్లే ..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోంది. షెడ్యూల్ వెలువడటానికి ఎంతో సమయం లేదు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సిద్ధమౌతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల ప్రచారానికీ దిగింది.

 

అటు తెలుగుదేశం- జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ జాప్యం కొనసాగుతూ వస్తోంది. భారతీయ జనతా పార్టీని కూడా తమ కూటమిలో కలుపుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు కూడా.

 

ఈ పరిస్థితుల్లో కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి తెర మీదికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చారాయన. ఏయే లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సి ఉంటుందనేది వెల్లడించారు.

 

జనసేన పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉన్న ఏడు లోక్‌సభ నియోజకవర్గాలను చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఏడు స్థానాలను దక్కించుకోవాలని పేర్కొన్నారు. కాపు, బలిజ.. సామాజిక వర్గాల ఓటుబ్యాంకు అధికంగా ఉండే లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

 

విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట లోక్‌సభల్లో పోటీ చేయాలని హరిరామ జోగయ్య.. పవన్ కల్యాణ్‌కు సూచించారు. అభ్యర్థుల పేర్లను కూడా ఆయనే ప్రతిపాదించారు.

 

విజయనగరం- గెదెల శ్రీనివాస్ (తూర్పు కాపు), అనకాపల్లి- కొణిదెల నాగబాబు (కాపు)/బొలిశెట్టి సత్యనారాయణ (కాపు)/కొణతల రామకృష్ణ (గవర), కాకినాడ- సానా సతీష్ (కాపు), నర్సాపురం- మల్లినీడి తిరుమలరావు (కాపు), మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి (కాపు), తిరుపతి- వర ప్రసాద్ (ఎస్సీ), రాజంపేట- ఎస్ బాలసుబ్రహ్మణ్యం (బలిజ)లను అభ్యర్థులుగా ప్రకటించాలని అన్నారు.