AP

నారా లోకేష్‌కు వినతుల వెల్లువ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ నేత నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం యాత్ర’కు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని లోకేష్ దుయ్యబట్టారు.

 

నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని జగన్.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు నారా లోకేష్. మోసం, దగా, కుట్రకి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్‌లా ఉంటుందన్నారు. 2019 ఎన్నికల ముందు 23వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఏడాదిలో ఇప్పుడు కేవలం 6వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇక వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ అన్నారు. జగన్ తన కుటుంబంలోని వారికే రక్షణ కల్పించడం లేదని విమర్శించారు.

 

లోకేష్‌కు వినతుల వెల్లువ : శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చాపురం వచ్చిన లోకేష్‌ను కలుసుకున్న పలువురు స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న సాంప్రదాయ మత్స్యకార కండ్ర కులస్తులను ఎస్టీలుగా గుర్తించడంతో పాటు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గీయులు విన్నవించారు.

 

శ్రీకాకుళంలో సాంకేతిక కారణాల వల్ల తిత్లీ తుఫాను పరిహారం పొందలేని 7 వేల మందికి న్యాయం చేయాలని మరికొందరు లోకేష్‌ను కోరారు. వంశధార-బహుదా నదిని అనుసంధానించి శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని రైతులు విన్నవించారు. శ్రీకాకుళం జిల్లాలో 1998 డీఎస్సీ క్వాలిఫై అయిన 350 మందిని రెగ్యులరైజ్ చేయాలని నిరుద్యోగ టీచర్లు విజ్ఞప్తి చేశారు.

 

మరోవైపు, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతో ఒరియా కులం వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించాలని ఆ సామాజికవర్గీయులు కోరారు. గోపాల మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు విన్నవించారు. ఎక్స్ సర్వీస్ మెన్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ సైనికులు వినతిపత్రంసమర్పించారు.

 

రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆర్ఎంపి డాక్టర్లు కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు విన్నవించారు. అందరి సమస్యలను ఓపిగ్గా ఆలకించిన నారా లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఒక్కరికీ న్యాయంచేస్తామని భరోసా ఇచ్చారు.