AP

దీపక్ వైపు చంద్రబాబు మొగ్గు-గేమ్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కవగా అక్కడే ఫోకస్ కావటంతో సీమ జిల్లాల్లోనూ బలం చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

సీమ లెక్కలు : రాయలసీమలో ఈ సారి హోరా హోరీ పోరు తప్పేలా లేదు. 2019 ఎన్నికల్లో సీమ రీజియన్ లోని నాలుగు జిల్లాల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకు పరిమితం అయింది. ఈ సారి పూర్తిగా పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా పార్టీకి పట్టున్న అనంతపురం జిల్లా పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. అదే విధంగా రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. హిందూపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ కోరుతోంది. జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను వైసీపీ బీసీలకు కేటాయించింది. దీంతో, ఇప్పుడు అనంతపురంకు కాల్వ శ్రీనివాసులు, హిందూపురం కు పార్ధసారధి పేర్లను పార్టీ దాదాపు ఖరారు చేసింది.

 

 

రాయదుర్గం దక్కేదెవరికి : ఈ క్రమంలో రాయదుర్గం సీటు విషయంలో చంద్రబాబు తాజాగా సర్వేలు చేయించారు. తాను ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కాల్వ శ్రీనివాసులు కోరుతున్నారు. కానీ, పార్టీ మాత్రం ఎంపీగానే పోటీ చేయించాలని ఫిక్స్ అయింది. దీంతో..నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, పూల నాగరాజు పేర్ల పైన సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా,కేడర్ మద్దతు ఉన్న దీపక్ రెడ్డి వైపు ప్రస్తుతం పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. లోకేష్ కు సన్నిహితుడుగా పేరున్న దీపక్ రెడ్డి వైసీపీ పైన రాజకీయ పోరాటంలో జిల్లాలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ వాయిస్ జాతీయస్థాయిలో బలంగా వినిపించే నేతగా దీపక్ రెడ్డికి పేరు ఉంది. ఇదే సమయంలో వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని గోవిందరెడ్డిని వైసీపీ అక్కడ అభ్యర్థిగా ఖరారు చేసింది.

 

చంద్రబాబు కసరత్తు : కాపు రామచంద్రారెడ్డి పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఒక దశలో కాపు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే వాదన వినిపించింది. కాపు వర్గం ఇప్పుడు గోవిందరెడ్డికి సహకరిస్తుందా అనే అనుమానం వెంటాడుతోంది. ఈ సమయంలో సామాజిక వర్గ పరంగా గోవిందరెడ్డికి ధీటుగా దీపక్ రెడ్డిని నిలబెట్టే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ – వారి కుమారుల్లో ఒకరికి మాత్రమే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. అనంతపురం ఎంపీ సీటు కాల్వకు కేటాయించటంతో జేసీ కుమారుడు పవన్ కు సీటు దక్కటం లేదు. దీంతో, రాయదుర్గంలో దీపక్ రెడ్డికి ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సర్వేలు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపుతుండటం, ఇతరత్ర సమీకరణాలు అనుకూలంగా ఉండటం దీపక్‌కు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఈ వారంలోనే రాయదుర్గం అభ్యర్థి పై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.