AP

వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డికి టీడీపీ ఆహ్వానం..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. నెల్లూరు పార్లమెంటు స్ధానంలో ఈసారి ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో పట్టించుకోకపోవడంతో అలికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది.

 

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. అలాగే వీపీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులిద్దరూ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఇప్పుడే చూశానని ఆయన వెల్లడించారు. వేమిరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ సీటు ఆఫర్ చేసే అవకాశాలున్నాయి.

 

వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) పదిమందికి దానధర్మాలు, సహాయం చేసేవారని, పేద పిల్లల కోసం అత్యున్నత ప్రమాణాలతో మంచి స్కూలు ను నిర్మించారని సోమిరెడ్డి గుర్తుచేశారు. జిల్లాలో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారని, దేవాలయాలు నిర్మించారని, దానధర్మాలు చేస్తుంటారని సోమిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే రాజకీయ నేత కాదన్నారు. వైసీపీలో ఇమడలేకే వీపీఆర్ బయటకు వచ్చేశారన్నారు.

 

ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు దృష్ట్యా అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసుకుందామని వీపీఆర్ కు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరాలన్నారు. మంచి వాళ్లకి వైకాపా లో స్థానం లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా తో తేలిపోయిందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి వైకాపా లో ఇమడలేకపోయాడంటే జగన్, మంత్రుల పోకడలేంటో అందరికీ అర్ధమవుతోందన్నారు. వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు.