ఏపీలో మెగా డీఎస్సీ స్ధానంలో 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా వారు తప్పించుకుని ఉండవల్లి వరకూ వెళ్లారు. దీంతో పోలీసులు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
వైఎస్ షర్మిలను ఏపీ పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ నేతలైన కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ వంటి వారు షర్మిల అరెస్టును ఖండిస్తూ ట్వీట్లు పెట్టారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని షర్మిలను చూస్తే అంత భయమెందుకని వారు ప్రశ్నించారు. దీంతో జాతీయ స్ధాయిలో షర్మిల అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది.
అటు వైఎస్ షర్మిల కూడా తన అరెస్టుపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన అరెస్టు ఘటనపై అమ్మ బాధపడుతోందని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమేనన్నారు. సచివాలయంలో వినతిపత్రం ఇచ్చే స్వేచ్చ కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు సీఎం రాడని, మంత్రులు లేరని, అధికారులు రారని షర్మిల విమర్శించారు. ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.