AP

వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు-అనూహ్యంగా సాయిరెడ్డికి- మంగళగిరిలో మళ్లీ మార్పు..

వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్దానంలో మరోసారి ఇన్ ఛార్జ్ మార్పు ఉండటం సంచలనంగా మారింది.

వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల జాబితాలో కేవలం మూడు పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నెల్లూరు లోక్ సభ స్ధానం ఇన్ ఛార్జ్ తో పాటు కర్నూలు, మంగళగిరి అసెంబ్లీ స్ధానాల ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. వీటిలో నెల్లూరు లోక్ సభ సీటుకు వైసీపీ ఇన్ ఛార్జ్ గా అనూహ్యంగా పార్టీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడిన అనుభవం లేని సాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.

 

అలాగే కర్నూలు అసెంబ్లీ సీటులో ఈ మధ్యే వీఆర్ఎస్ ప్రకటించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ ను బరిలోకి దింపుతున్నారు. ఇంతియాజ్ కు ఇప్పటికే సీఎం జగన్ కర్నూలు అసెంబ్లీ సీటుపై హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో ఆయన పేరు కూడా ప్రకటించారు. మరోవైపు మంగళగిరి అసెంబ్లీ స్ధానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ మరోసారి మారిపోయారు. ఇప్పటికే ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన గంజి చిరంజీవి స్ధానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను ఇన్ ఛార్జ్ గా ఎంపిక చేశారు. దీంతో గంజి చిరంజీవికి నిరాశ తప్పడం లేదు.