ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు విరుచుకుపడుతున్నారు.
కాగా, హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ .. ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కీలకమన్నారు. ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్ కిశోర్.. ఓటేసే ముందు జనం అభివృద్ధి కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు.
అయితే, ఈ విషయంలో వైఎస్ జగన్ పెద్ద తప్పే చేశారన్నారు ప్రశాంత్ కిషోర్. ఈ తప్పులే ఓటమికి దారితీస్తాయన్నారు. ప్రజల డబ్బునే ఖర్చు పెడుతూ.. ప్రజలను కాపాడుతున్నట్లుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదన్నారు ప్రశాంత్ కిషోర్. తాను ఏపీలో గెలుపోటములపై ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్న ఆయన.. గతంలో అక్కడ పని చేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధి విషయంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. కొందరు సలహాలు, సూచనలే జగన్ తీసుకుంటున్నారని.. అది రాబోయే ఎన్నికల్లో ముప్పుగా మారబోతుందంటూ పీకే హెచ్చరించారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం ఉందనే అపోహలున్నాయని.. ఈ తరుణంలో ఓటమి ఎదురవనుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఈ సారి మార్పును కోరుకుంటున్నారని పీకే వెల్లడించారు.
అయితే, పీకే వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరకుచుకుపడ్డారు. బీహార్ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి బొక్కబొర్లా పడ్డ పీకే.. ఏపీ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకు ఒక పీకే(పవన్ కళ్యాణ్).. సరిపోవడం లేదని.. మరో పీకేను మద్దతుగా తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పీకే పలుమార్లు భేటీ అయ్యారన్నారు. జగన్ వెంటే పీకేలు లేరని.. ప్రజలే ఉన్నారన్నారు.