AP

ఒక్కటైన ఆ ఇద్దరు నేతలు – చంద్రబాబు ప్లాన్ ఏంటి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నేతల జంపింగ్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కృష్ణా జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనకే అక్కడ సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో, రెండు వర్గాలుగా పని చేసిన ఉమా -బొమ్మసాని ఒక్కటయ్యారు. వసంతకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో, సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

 

మైలవరంలో కొత్త లెక్కలు : మైలవరం టీడీపీలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. తాజాగా ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు నుంచి వసంతకు మైలవరం సీటు పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో, వైసీపీ అక్కడ కొత్త సమీకరణాలకు తెర లేపింది. కొత్త ఇంఛార్జ్ గా తిరుపతిరావును ప్రకటించింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఇప్పటి వరకు పోటీ పడ్డారు. హోరా హోరీగా రాజకీయం చేసారు. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావటంలో ఒక్క సారిగా లెక్కలు మారిపోయాయి. ఉమా -బొమ్మసాని ఒక్కటయ్యారు. ఒకే వేదిక మీదకు వచ్చారు.

 

ఒక్కటైన ఇద్దరు నేతలు : ఈ ఇద్దరు నేతలు కలవటం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. వసంతక్ చెక్ పెట్టేందుకే ఈ ఇద్దరు ఒక్కటయ్యారనే చర్చ మొదలైంది. పార్టీ కోసం కలిసి పని చేస్తామని ఇద్దరు నేతలు పార్టీ కేడర్ కు స్పష్టం చేసారు. రేపు ఎన్నికల శంఖారావం, యువగళంలో ఇద్దరు పాల్గొననున్నారు. టీడీపీలో చేరిన వసంత తాను ఎవరికీ వ్యతిరేకం కాదని..అందరినీ కలుపుకొని వెళ్తానని స్పష్టం చేసారు. వసంత, ఆయన తండ్రి పైన దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తొలి జాబితాలో పేరు లేకపోవటంతో దేవినేని ఉమా చంద్రబాబును కలిసారు. ఆ సమయంలో ఉమాకు పెనమలూరు నుంచి పోటీ చేయటం పైన సూచన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తాను ఒక నిర్ణయం తీసుకుంటానని..అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.

 

చంద్రబాబు నిర్ణయం ఏంటి : ఇప్పుడు వసంత టీడీపీలోకి రావటంతో దేవినేని ఉమా – బొమ్మసాని అలర్ట్ అయ్యారు. ఉమా ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2009,2014లో విజయం సాధించారు. 2019లో 12,747 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. పెనమలూరు నుంచి ఉమా పోటీకి సిద్దంగా లేరని ఆయన అనుచరవర్గం చెబుతోంది. పెనమలూరు లో బరిలోకి దిగితే అక్కడ ఇంఛార్జ్ గా ఉన్న బోడే ప్రసాద్ సహకరించే పరిస్థితి లేదనేది వారి వాదన. ఇప్పుడు ఉమా – బొమ్మసానితో కలుపుకొని వెళ్లటం సీటు ఖరారైతే వసంతకు సవాల్ గా మారనుంది. దీంతో, మైలవరం నియోజకవర్గంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. చివరకు ఎన్నికల ఫలితం పై ఈ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.