TELANGANA

ఒంటిపూట బడులు, వేసవి సెలవుల పై ప్రభుత్వ నిర్ణయం..!!

తెలంగాణ ప్ర‌భుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు.

 

ఒంటిపూట బడులతో పాటుగా వేసవి సెలవుల పైన స్పష్టత వచ్చింది. పదో తరగతి పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు.

 

10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ అన్ని పాఠశాలలకు అదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

 

ఏప్రిల్ 24న ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. తిరిగి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కానున్నాయి.

 

వేసవి సెలవుల పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. గతం కంటే ఈ సారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, ప్రభుత్వం పాఠశాలల్లో ఒంటిపూట బడుల నిర్వహణ పైన నిర్ణయం ప్రకటించింది.