AP

ముద్రగడ ఇంటికి మిధున్ రెడ్డి – పోటీపై కీలక నిర్ణయం..

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం దాదాపు ఖాయమైంది. టీడీపీ ఎన్డీఏలో చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు జగన్ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలం పైన గురి పెట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో పోటీ పై ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తాజాగా ఇచ్చిన ఆఫర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

 

వైసీపీలోకి ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. ముద్రగడతో కాకినాడ పరిధిలోని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు భేటీ అవనున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ద్వారంపూడి, ఇతర నేతలు ముద్రగడతో భేటీ కానుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

ముద్రగడను ఈ నేతలంతా కలిసి వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే వైసీపీలో చేరిక పైన ముద్రగడతో ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ముద్రగడ వైసీపీలో చేరటానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని సమాచారం.

 

వైసీపీ నుంచి కీలక హామీ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్దిగా పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా..ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి వంగా గీత పోటీలో కొనసాగుతారు. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయంచాలని వైసీపీ ఆలోచిస్తోంది.

 

కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సైతం వైసీపీలోకి చేరగా… ఇక తాజాగా ముద్రగడను పార్టీలోకి తీసుకోవటం ద్వారా కాపు ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టేలా వైసీపీ వ్యూహం అమలు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్రగడ ప్రభావం ఉందని చెబుతున్నారు. పవన్ వైపు కాపు వర్గం మొగ్గు చూపుతున్న వేళ..ముద్రగడ తమతో ఉండట కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు.

 

ముద్రగడ లెక్క మారుస్తారా వైసీపీలో చేరిన తరువాత ముద్రగడ కుమారుడికి రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటెడ్ పదవి కట్టబెడతారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ లోగానే ఈ పదవి పైన ఉత్తర్వులు జారీ కానున్నాయి. ముద్రగడ పార్టీలో చేరి ప్రచారం చేస్తారని సమాచారం. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ రోజు వైసీపీ నేతల భేటీలో పార్టీలొకి ఆహ్వానించటం తో పాటుగా.. ఆ తరువాత ముద్రగడ తన రాజకీయ భవిష్యత్ పైన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అటు, 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత గోదావరి లో చోటు చేసుకొనే రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.