AP

ఒకే వేదికపై పీఎం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. మోడీ టూర్ ఫిక్స్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు ఏపీ అధికార పక్షమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్దం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు టిడిపి కూడా యువగళం తో పాటు ఇతర సభలను నిర్వహించి ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపిని ఎదుర్కోవడానికి టిడిపి, జనసేన, బిజెపిలు ఉమ్మడిగా పొత్తులతో ముందుకు వెళుతున్నారు .ఈ మేరకు సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయింది. పొత్తులు ఫైనల్ అయిన ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి ఆహ్వానించి సభను నిర్వహించాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

 

రానున్న ఎన్నికల నేపథ్యంలో మార్చి 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రోడ్ షో లో పాల్గొననుండగా, 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో జరిగే టిడిపి- బిజెపి- జనసేన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి బిజెపి కేంద్రనాయకులతో సమావేశమైన సమయంలో కూటమి బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులను కోరారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు.

 

ఇప్పటికే ఈ బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను ప్రకటించిన చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత నిర్వహించనున్న బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ప్రకటనలు చేస్తారని, కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

గతంలో 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైన మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ముగ్గురు ఒకే వేదిక పైకి రానున్న క్రమం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఈ బహిరంగ సభ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.