TELANGANA

టీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు..

జంటనగరాల్లో కొత్తగా ఎలక్ట్రిక్ నాన్ ఏసీ సిటీ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతోన్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారీగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడంలో భాగంగా వాటిని అందుబాటులోకి తీసుకుని వచ్చారు.

 

హైదరాబాద్‌లో అన్నీ ఎలక్ట్రిక్ సిటీ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా దశలవారీగా వాటిని నడిపిస్తోంది. ఇదివరకు 150కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టింది.

 

ఈ బస్సులను- హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

 

ఎలక్ట్రిక్ నాన్ ఏసీ సెమీ లో-ఫ్లోర్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఇవి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఒక్కో బస్సు. ఫుల్ ఛార్జింగ్‌కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం, ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ కల్పించారు.

 

గమ్యస్థానాల వివరాలను తెలియజేయడానికి ప్రతి బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి, వాటిని నివారించేలా బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలనేది టీఎస్ఆర్టీసీ ప్లాన్.

 

ఈ బస్సు పొడవు 12 మీటర్లు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో మొబైల్ ఛార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది.