TELANGANA

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇలా చేయండి..!

ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? ఏం చేయాలి అనే గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పథకాలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అమలు చేసుకుంటూ వెళుతోంది.

 

అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటిద్వారా ఒక్కో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. గృహజ్యోతి, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి ఇలాగే లబ్ధిదారులను ఎంపిక చేసి తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. ఇంటి నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరుతోనే ఇస్తారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలవారే దీనికి అర్హులు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు లేనివారికి ముందుగా ఆర్థిక సాయం అందజేస్తారు. లబ్ధిదారులు స్థానికులై ఉండటంతోపాటు అద్దెకు ఉండేవారు కూడా అర్హులే.

 

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఫైనల్ జాబితాను కలెక్టర్లు సిద్ధం చేస్తారు. గ్రామ పంచాయతీలో ఉన్న జనాభాను ఆధారం చేసుకొని ఇంటి మంజూరు ఉంటుంది. తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామసభలు, వార్డు మీటింగ్ లు నిర్వహించి ప్రకటించిన తర్వాత వాటిని ఆర్డీవో ద్వారా కలెక్టర్ కు, తర్వాత ఇన్ ఛార్జి మంత్రి ఫైనల్ చేస్తారు.

 

ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షల సాయం నాలుగు దశల్లో అందుతుంది. బేస్‌మెంట్‌ పూర్తయ్యాక లక్ష రూపాయలు, స్లాబ్‌ లెవల్‌ లో మరో లక్ష రూపాయలు, స్లబ్ అయిన తర్వాత రూ.2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం జరిగిన అవకతకవలు జరగకుండా అర్హులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.