National

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన మలి జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. మొత్తం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది.

 

ఇటీవలే 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి పేర్లను పొందుపరిచింది. ఇప్పుడు విడుదలైన రెండో జాబితాలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. తెలంగాణ నుంచి గానీ, ఏపీ నుంచి గానీ అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు.

 

 

ఈ రెండో జాబితాలో అస్సాం- 12, గుజరాత్- 7, మధ్యప్రదేశ్- 10, రాజస్థాన్- 10, ఉత్తరాఖండ్- 3, కేంద్ర పాలిత ప్రాంతం దమన్ అండ్ డయ్యూ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల తనయులకు ఈ జాబితాలో చోటు దక్కింది.

 

మొన్నటి వరకు బీజేపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌కు లోక్‌సభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి నకుల్ నాథ్ పోటీ చేయనున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పేరు కూడా జాబితాలో కనిపించింది.

 

రాజస్థాన్‌లోని జాలోర్ లోక్‌సభ నుంచి వైభవ్ గెహ్లాట్ ఎన్నికల బరిలో దిగనున్నారు. సిట్టింగ్ ఎంపీ గౌరవ్ గొగొయ్.. అస్సాంలోని జొర్హాట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారు. చురు నుంచి రాహుల్ కస్వా, భిండ్ నుంచి ఫూల్ సింగ్ బైర్యా లోక్‌సభ ఎన్నికల రేసులో నిలిచారు. మూడో జాబితాలో తెలంగాణకు చోటు దక్కొచ్చు.