AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రాజకీయ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ , జనసేన పొత్తు ఖాయం కావడంతో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార వైసీపీ, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోవు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే సీఎం జగన్ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

 

ఉభయ గోదావరి జిల్లాల నుంచి బలమైన నేతలను పార్టీలోకి తీసుకువచ్చే పనిలో పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికార పార్టీ గట్టి షాకిచ్చింది. టీడీపీ కీలక నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.యనమల కృష్ణుడుతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. యనమల కృష్ణుడు పార్టీలో చేరికపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించినట్టు సమాచారం అందుతోంది.

 

సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో యనమల చేరిక లాంఛన ప్రాయమే. ఈ నెల 15న లేదా 17న వైసీపీ కండువా కప్పుకునేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014,2019 ఎన్నికల్లో తుని నుండి యనమల కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. ఈసారి తుని టికెట్‌ను యనమల రామకృష్ణుడు కూతురికి కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

 

యనమల రామకృష్ణుడు సోదరుడు టీడీపీని కాదని వైసీపీలో చేరడం ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. తమ్ముడు పార్టీ మారడంతో టీడీపీలో ఉన్న యనమల రామకృష్ణుడుపై ఒత్తిడి పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక వైసీపీలో చేరుతున్న యనమల కృష్ణుడుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ దక్కడంతోనే ఆయన పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. తుని నుంచి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో.. పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని సీఎం జగన్ మాటిచ్చినట్టుగా పార్టీ నాయకులు తెలిపారు.