AP

ఈ నెల 16వ తేదీన టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.

 

ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.

 

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ వీడారు. నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. గురువారం తెలుగుదేశం పార్టీ విడుదల చేసే రెండో జాబితాలో వేమిరెడ్డి పేరు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

 

ఈ పరిణామాల మధ్య మరో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో సిట్టింగ్ ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకోవడానికి సిద్ధపడ్డారు. తన తనయుడితో కలిసి ఈ నెల 16వ తేదీన టీడీపీ చేరబోతోన్నట్లు ప్రకటించారు కూడా.

 

ఆయనే- ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మరోసారి ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. ఓటమి తప్పదంటూ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన నేపథ్యంలో మాగుంట టికెట్ ఇవ్వలేదాయన.

 

మాగుంట కోసం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేసిన లాబీయింగ్ కూడా ఫలించలేదు. దీనికి వైఎస్ జగన్ తల వంచలేదు. టికెట్ దక్కదనే విషయం ఖరారు కావడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన తనయుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరనున్నారు.

 

ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు మాగుంట. ఈ మేరకు ప్రకాశం జిల్లా ప్రజలకు ఓ బహిరంగ లేఖను రాశారు. తనను, తన కుటుంబాన్ని ఎప్పట్లాగే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.