AP

టీడీపీకి మరో షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు.. రెండో జాబితాలో అయిన తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండో జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.

 

బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ వంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీరంతా కూడా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించడానికి రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ సౌత్ సీటు ఆశించిన గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. భీమిలికి చెందిన పాసర్ల ప్రసాద్ సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు.

 

తాజాగా తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకు కేటాయించడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈలి నాని గతంలోనే టీడీపీని వీడాలని భావించినప్పటికీ .. ఎన్నికల దగ్గరపడుతుండటంతో సీటు తనకే వస్తుందనే ఆశతో టీడీపీలోనే ఉండిపోయారు.

 

అయితే టికెట్ విషయంలో ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో ఈలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సీఎం జగన్‌ను కలిసిన ఈలి నాని ఆయన సమక్షంలోనే వైసీపీలో చేరారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తన వంతు కృష్టి చేస్తానని ఈలి నాని తెలిపారు.

 

ఈలి నాని 2009లో ప్రజారాజ్యం తరుఫున తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఈలి నాని టీడీపీలో చేరారు. అప్పటి నుంచి తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా పని చేస్తున్నారు. తాజాగా టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు.