AP

జనసేనకు ఈసీ బిగ్ షాక్..!

రాష్ట్రంలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా సెగ పుట్టిస్తోంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా సిద్ధం అంటే సిద్ధం అంటున్నాయి. ప్రచారాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల్ కమిషన్ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను విడుదల చేసింది.

 

ఎన్నికల కమిషన్ విడుదల చేసి గుర్తింపు జాబితాలో రాష్ట్రం నుంచి వైసీపీ, టీడీపీలు ఉన్నాయి. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు కేటాయించింది. ఇదే సమయంలో జనసేనను మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. కేవలం రిజిష్టర్ పార్టీగానే గుర్తించింది. అందువల్లనే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. అయితే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. జనాల్లో కూడా ఈ గుర్తు బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ గుర్తును ప్రమోట్ చేసుకున్నారు.

 

ఓ దేవాలయం వద్ద ఉత్సవం జరుగుతుండగా అక్కడ రౌడీలు విధ్వంసం చేస్తుండగా అక్కడికి వచ్చి రౌడీలను చితకబాదుతారు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో ఓ విలన్ గాజు గ్లాసు చూపిస్తూ.. నీ రేంజ్ ఇదీ అంటూ పోలీస్ స్టేషన్‍లో దాన్ని పగులకొడతాడు. అప్పుడు వెంటనే భగత్ సింగ్.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది. అని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. ఇప్పుడు తాము మరింత పదునెక్కామని చెప్పేలా ఈ డైలాగ్ అనిపిస్తోందని జనాల నుంచి టాక్ వినిపిస్తోంది.

 

ఇదంతా పక్కనబెడితే ఈసీగా తాజాగా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించడంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ గుర్తును మారిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుందని పార్టీ క్యాడర్ కంగారు పడుతోంది. మరి ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమచారం