AP

శబరిమల సన్నిధానంలో భక్తుడి ఆత్మహత్య..!

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. ఇప్పటివరకు 22 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

 

మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

 

ఈ పరిణామాల మధ్య శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాలధారణ చేసిన ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన పేరు కుమారస్వామి. వయస్సు 40 సంవత్సరాలు. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు జిల్లా కనకపురకు చెందిన భక్తుడాయన.

 

సోమవారం సాయంత్రం సన్నిధానం నుంచి మాలికాపురం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుమారు 30 అడుగుల పైన ఉన్న ఈ ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లు, చేతులు విరిగాయి. ఎముకలు చిట్లిపోయాయి.

 

తోటి భక్తుల సహాయంతో ఆలయ భద్రత సిబ్బంది హుటాహుటిన ఆయనను సన్నిధానంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మరణించారు.

 

చాలాకాలంగా కుమారస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మానసిక స్థిరత్వాన్ని కోల్పోయారని తెలుస్తోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందనే ఉద్దేశంతో ఆయన అయ్యప్ప మాల ధరించారని, ఆయనతో పాటు వచ్చిన కర్ణాటక భక్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.