AP

తెనాలిలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి నాదెండ్ల..

క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలిలో సువిశాలమైన స్టేడియంను నిర్మించనున్నామని ఏపీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 1.76 ఎకరాల మున్సిపల్ భూమిని సేకరించి రూ. 3 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అందులోనే వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 

పట్టణ అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, మెరుగైన వైద్య సదుపాయాలు, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా, తెనాలి కళాకారుల సంస్కృతి తదితర అంశాలను ప్రాథమికంగా తీసుకుని తెనాలి పట్టణాన్ని అభివృద్ధి నిర్మాణంలో నడిపిస్తామని నాదెండ్ల వివరించారు. తెనాలి పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణతో పాటు నిఘా కెమెరాలు ఏర్పాటుపై పరిశీలిస్తున్నామని తెలిపారు.

 

గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా తెనాలి-కొల్లిపర సీసీ రోడ్లు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. రూ 20 లక్షలతో చినారావూరు పార్క్ ను మరమ్మత్తులు చేపట్టి డిసెంబర్ 30 నాటికి సుందరీకరణ చేయబోతున్నామని, రూ 1.15 కోట్లతో తెనాలి ఐతానగర్ లో ఐకర్స్ పార్క్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. సంక్రాంతి పండగలోపు దుగ్గిరాల, మంగళగిరి రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేస్తామని చెప్పారు.