ఎట్టకేలకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టుల పర్వం మొదలైంది. మూడో కంటికి తెలీకుండా విచారణ జరుపుతోంది స్పెషల్ విచారణ టీమ్. లేటెస్ట్‌గా నలుగుర్ని సిట్ అరెస్ట్ చేయడం జరిగిపోయింది. వెంటనే న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టడం, ఈనెల 20 వరకు ఆయన రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారంతో వైసీపీ పెద్దల వెన్నులో వణుకు మొదలైంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తీగలాడితే డొంక కదులుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్. తిరుపతిలో మకాం వేసింది దర్యాప్తు టీమ్. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిపిన్ గుప్తా, పోమిల్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేసింది.
ఆ తర్వాత వారిని విచారించింది. రాత్రి పదిన్నర గంటల సమయంలో రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి ముందు నిందితులను ప్రవేశపెట్టారు. వారికి ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఇవే తొలి అరెస్టులు. త్వరలో పలువురు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆనాడు టీటీడీలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ అనుచరలు, మరికొందరు ఉద్యోగులున్నట్లు అంతర్గత సమాచారం.
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. సీబీఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, ఇతర సభ్యులు మూడురోజులుగా వైష్ణవి డెయిరీకి చెందిన సిబ్బందిని విచారించారు. సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టయిన నలుగుర్ని ఆదివారం విచారణకు పిలిచారు. అయితే విచారణలో వీరంతా నీళ్లు నమలడంతో అధికారులు షాకయ్యారు.
సీబీఐ సిట్ విచారణలో ఏఆర్ డెయిరీ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్టు వైష్ణవి డెయిరీ తప్పుడు రికార్డులు క్రియేట్ చేసినట్టు తేలింది. ముఖ్యంగా భోలే బాబా డెయిరీకి ఈ స్థాయిలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మూడు డెయిరీలకు చెందిన నలుగురు అరెస్ట్ అయ్యారు.
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సమయంలో బిపిన్ జైన్, పోమిల్ జైన్ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించినట్టు సమాచారం. భోలేబాబా డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ.355 లకు కొనుగోలు చేసింది వైష్ణవి డెయిరీ. ఆ తర్వాత ఏఆర్ డెయిరీకి రూ.319 కి సరఫరా చేసినట్టు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువకు ఎలా సరఫరా చేశారనేది ఈ కేసులో కీలకమైన పాయింట్. ఇప్పుడు దీనిచుట్టూనే దర్యాప్తు సాగుతోంది.
గతేడాది తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ వేయడం, దానిపై అప్పటి వైసీపీ పెద్దలు న్యాయస్థానం తలుపుతట్టారు. చివరకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీ నుంచి డాక్టర్ సత్యేన్ కుమార్ పాండా సభ్యులుగా ఉన్నారు.