AP

వైసీపీ రీకాలింగ్ మేనిఫెస్టో.. ! ఎందుకంటే..?

చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ.. అంటూ ఏపీలో వైసీపీ ఇంటింటి తలుపుతట్టే కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో పెద్దనేతలెవరూ యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలసి కూటమి మేనిఫెస్టో సరిగా అమలు కావడం లేదని చెప్పడం జగన్ ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశాల్ని ఆశల్ని నేతలు పట్టించుకోలేదు. చోటా మోటా నేతలు మాత్రం క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డులు పట్టుకెళ్లి జనం దగ్గర నిలబడి ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడపకు వైసీపీ అనే తూతూమంత్రం కార్యక్రమం జరిగింది. ఇప్పుడిది దానికంటే ఘోరం. జనాల దగ్గరకు వెళ్లండి అంటూ అధినాయకుడు చెబుతున్నా, నాయకులకు ఆమాత్రం ఓపిక లేదు. దీంతో ఒకరకంగా జగన్ మోసపోయినట్టయింది.

ఏం చేయాలి..?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ఎక్కడా అసంతృప్తి కనిపిస్తున్న దాఖలాలు లేవు. సూపర్ సిక్స్ లో ఒకటీ అరా పథకాలు ఇంకా పట్టాలెక్కలేదు కానీ, తల్లికి వందనంతో కుటుంబాలు ఫుల్ ఖుషీ. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. ఇక పెన్షన్ల గురించయితే చెప్పుకోవాల్సిన పనే లేదు. జగన్ లాగా విడతకు 250 రూపాయలు కాకుండా ఒకేసారి రూ.4వేలకు పెన్షన్లు పెంచి ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్ ఎన్ని విమర్శలు చేసినా జనం నమ్మేలా లేరు. ఇలాంటి సందర్భంలో జగన్ ఏం చేయాలి? ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటే ఎలాంటి వ్యూహం అమలు చేయాలి? ప్రస్తుతానికి వెయిట్ చేయక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సమయం తమది కానప్పుడు అదనుకోసం వేచి చూసి, కూటమి ఏదైనా పెద్ద తప్పు చేస్తే అప్పుడు రంగంలోకి దిగాలని చెబుతున్నారు.

ఏం చేస్తున్నారు..?
కానీ జగన్ కి అంత ఓపిక లేదని అర్థమవుతోంది, వైసీపీ నేతలు చేజారకుండా ఉండాలంటే హడావిడి చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారాయన. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ పేరుతో ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది, అది మొదలు ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. దీనికి తాజా నిదర్శనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో. అసలు మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలంటే రీకాలింగ్ జగన్స్ నవరత్నాలు అంటూ మొదలు పెట్టుకోవాలి. అందులో సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది అస్సలు అమలు కాలేదు. ఇక ఎన్నికల టైమ్ లో ఇచ్చిన సీపీఎస్ రద్దు వంటి హామీలకు దిక్కే లేదు. మరి ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయాలంటూ జగన్ డిమాండ్ చేస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు. నిన్నటి వరకు తల్లికి వందనం ఏది అని ప్రశ్నించారు, అది ఇవ్వగానే ఇప్పుడు వంకలు వెదకడం మొదలు పెట్టారు. కానీ జగన్ పిలుపునిచ్చిన రీకాలింగ్ కార్యక్రమం సక్సెస్ కాలేకపోయింది. కీలక నేతలెవరూ రోడ్లపైకి రావడం లేదు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి అంతంతమాత్రమే. ఇంకా చెప్పాలంటే అసలు జగనే ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. మరి దీనికి జనం నుంచి స్పందన వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.

తేడా ఏంటి..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వెంటనే రోడ్లెక్కి నిరసనలకు పిలుపునివ్వలేదు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలు పెడితే జగన్ తప్పుమీద తప్పు చేస్తున్నంతసేపు అవకాశం కోసం ఎదురు చూసింది టీడీపీ. చంద్రబాబు అరెస్ట్ తో ఆ తప్పులు పీక్ స్టేజ్ కి చేరాయి. అక్కడ్నుంచి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. చివరకు ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలు కనపడ్డంలేదు. జగన్ ఉనికికోసం పడుతున్న పాట్లు విజయవంతం కావడం లేదని అంటున్నారు నెటిజన్లు.