ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును.. శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్ సఫలం కావడంతో సరిహద్దు ప్రాంతాల రైతులకు భరోసా లభించినట్లయిందని పేర్కొన్నారు.
“గత 15 రోజులుగా మొగిలి ప్రాంతంలోని మామిడి తోటలపై అడవి ఏనుగుల గుంపు దాడులు చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ‘ఆపరేషన్ కుంకీ’కి శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ఆపరేషన్‌ను కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ, జయంత్, వినాయక అనే మూడు కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. ఈ కుంకీలు అడవి ఏనుగుల గుంపును ధైర్యంగా ఎదుర్కొని, తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా దారి మళ్లించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ‘కృష్ణ’ అనే కుంకీ చాలా చురుగ్గా వ్యవహరించి ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు.
మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చింది. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.