వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.
క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.
‘ఆడుదాం ఆంధ్రా’లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.