AP

నిరుద్యోగులను మోసం చేయడానికే ఇప్పుడు నోటిఫికేషన్లు : టిడిపి నేత గంటా..

ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగనుండగా.. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం.. జగన్ ప్రభుత్వం వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అని తెలుగుదేశం సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్-1,గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని గంటీ శ్రీనివాస్ తప్పుబట్టారు.

 

ఇన్ని సంవత్సరాల పాటు నిరుద్యోగులను మోసం చేసి సరిగ్గా ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం అని చెప్పారు. అసలు ఉద్యోగాల భర్తీపై జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అందుకే ఎన్నికలకు 5-6 నెలల ముందు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు.

 

ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేసేందుకు ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ పరీక్షలపై నిరుద్యోగులకు ఆశలు కలిగించి ఇంతవరకు వాటి ఊసే లేదని ఆయన ఎద్దేవా చేశారు.

 

ఇప్పుడు విడుదల చేసిన గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్ల ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాలి.. మరి ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఆ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్దాక గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ తతంగమంతా తెలిసే ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.