ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏపీ టెక్నాలజీ ప్రగతికి సంబంధించిన భారీ ప్రతిపాదనలను కేంద్రమంత్రి ముందు ఉంచారు.
భారీ ప్రాజెక్టులకు నిధులు, జాతీయ గుర్తింపు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు జాతీయస్థాయి గుర్తింపుతో పాటు ఆర్థిక చేయూతను అందించాలని మంత్రి లోకేశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘క్వాంటమ్ వ్యాలీ పార్కు’ను దేశంలోనే మొట్టమొదటి జాతీయస్థాయి క్వాంటమ్ క్లస్టర్‌గా అధికారికంగా గుర్తించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థించారు. అదేవిధంగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రకటించి, రూ. 300 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. ఈ హబ్‌ను కేంద్ర ప్రభుత్వ ‘ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్’లో చేర్చాలని సూచించారు. 2026లో అమరావతిలో ‘గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్’, ‘ఇండియా ఇన్నోవేషన్ వీక్’ నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
విధానపరమైన సంస్కరణలు.. ఐటీ విస్తరణే లక్ష్యం
రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని లోకేశ్ కోరారు. ముఖ్యంగా టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఇవ్వాలన్నారు. ఇందుకోసం ‘పర్మినెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్’ నిబంధనలను తక్షణమే సవరించాలని సూచించారు. విదేశీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ మార్పులు అవసరమని వివరించారు. రాష్ట్రంలో మేధో సంపత్తిని కాపాడుతూ, ఏఐ శిక్షణ, టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ (TDM) వంటి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించేందుకు కాపీరైట్ చట్టంలోని సెక్షన్-52కు సవరణలు చేయాలని కోరారు.
విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి చేయూత
రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్రం సహకరించాలని లోకేశ్ అన్నారు. గ్లోబల్ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖపట్నంలో సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు. జాతీయ విద్యా విధానం-2020 కింద రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు, పాఠశాల స్థాయిలోనే స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐఐటీ, ఐఐఎస్సీల సహకారంతో అమరావతిలో ‘నేషనల్ క్వాంటమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’, ‘డీప్ టెక్ స్కిల్ అకాడమీ’ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రగతిపై ప్రజెంటేషన్.. కేంద్రం సానుకూలత
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్, రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ప్రతిష్ఠాత్మక ఇన్నొవేషన్ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రమంత్రికి వివరించారు. డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, పీజీఆర్ఎస్, అన్నదాత సుఖీభవ, డ్రోన్ మార్ట్ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టుల పనితీరును తెలియజేశారు. క్వాంటమ్ వ్యాలీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ‘వికసిత్ భారత్-2047’లో భాగంగా బ్రాండింగ్ చేసి, జాతీయ ఆవిష్కరణల్లో ఏపీని ముందంజలో ఉంచేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మంత్రి లోకేశ్ సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టెక్ ఇంక్యుబేషన్, క్వాంటమ్, బయోటెక్ వంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి అవసరమైన సంస్కరణలను ఏపీలో అమలు చేసేందుకు కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.