AP

బీఆర్ఎస్ కు పట్టిన గతే జనసేనకు పడుతుంది!: సీపీఐ నారాయణ హెచ్చరిక..

బీజేపీతో జతకట్టే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీ అందించేది అభయహస్తం కాదని, అది పార్టీలను నాశనం చేసే ‘భస్మాసుర హస్తం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

 

ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటిలో చీలికలు తీసుకురావడమే బీజేపీ వ్యూహమని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బీజేపీకి దగ్గర కావడం వల్లే బీఆర్ఎస్‌లో విభేదాలు తలెత్తాయని, ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వంటి పరిణామాలకు కూడా ఆ పార్టీయే కారణమని ఆయన విమర్శించారు. ఇదే తరహాలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను, తమిళనాడులో అన్నాడీఎంకేను బీజేపీ బలహీనపరిచిందని గుర్తు చేశారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ భవిష్యత్తుపై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కూడా ఇదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ భస్మాసుర హస్తం ప్రభావం మిత్రపక్షాలైన చంద్రబాబు వంటి నేతలకు కూడా తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని నారాయణ సూచించారు.