AP

ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త రూపునిచ్చి, ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, అనంతపురంలో ప్రపంచ ప్రఖ్యాత ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కేవలం కొత్త ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే కాకుండా, వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంపై కూడా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో పర్యాటకుల బస కోసం గదుల కొరత లేకుండా చూడాలని, 2026 మార్చి నాటికి 10 వేల గదులు, 2029 నాటికి ఏకంగా 50 వేల గదులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణానికి అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని సూచించారు.

 

ముఖ్యంగా తిరుపతి సహా ఇతర ప్రసిద్ధ ఆలయ నగరాల్లో ‘హోమ్ స్టే’ విధానాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలిపారు. కోనసీమ సహజ సౌందర్యాన్ని, గ్రామీణ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా అక్కడ ప్రత్యేక హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులను (ఎన్ఆర్ఐ) కూడా భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ హోమ్ స్టేలు తప్పనిసరిగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

 

కొత్త ప్రాజెక్టులతో పర్యాటకానికి కొత్త శోభ

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో, చింతపల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టు, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖపట్నంలో డాల్ఫిన్ షో వంటివి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గండికోట, తైడ, అరకు, సూర్యలంక, లంబసింగి వంటి ప్రాంతాల్లో టెంట్ సిటీలను వేగంగా ఏర్పాటు చేయాలన్నారు. చారిత్రక కొండపల్లి ఖిల్లా వంటి కట్టడాలను ప్రైవేటు సంస్థలు దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.

 

రాజమండ్రిని ఒక ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, చారిత్రక హావ్లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా మలిచే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి పథకాల కింద చేపట్టిన బొర్రా గుహలు, సింహాచలం, అన్నవరం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

స్థానిక ఉత్పత్తులతో బ్రాండింగ్.. వైభవంగా ఉత్సవాలు

 

ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి స్థానిక ఉత్పత్తులను బ్రాండింగ్‌కు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్, మన సంప్రదాయ కూచిపూడి నృత్యం, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి చేనేత వస్త్రాలను పర్యాటక కేంద్రాల్లో ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని అన్నారు.

 

మరోవైపు, విజయవాడ దసరా ఉత్సవాలను మైసూరు దసరా ఉత్సవాల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల సమయంలో నగరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం తీసుకురావాలన్నారు.

 

ఈవెంట్లు జరిగే నగరాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యాటకుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని హెచ్చరించారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్‌గా పాల్గొనగా, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం, రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శన కోసం ఎంపిక చేసిన ఆరు పురాతన తెలుగు తాళపత్ర గ్రంథాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.