AP

మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న అన్నదాత పోరు..

రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. ‘అన్నదాత పోరు’ పేరిట ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

 

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు.

 

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎరువుల కొరతను సృష్టిస్తోందని సజ్జల ఆరోపించారు. “కొరత లేదని చెబుతూనే రైతులను క్యూ లైన్లలో గంటల తరబడి నిలబెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటూ మాఫియాను నడిపిస్తున్నారు” అని ఆయన విమర్శించారు. తమ సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కూడా సజ్జల మండిపడ్డారు. “యూరియా వాడితే కేన్సర్ వస్తుందంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. సంక్షోభం సృష్టించి లబ్ధి పొందడమే చంద్రబాబుకు తెలుసు” అంటూ సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.