AP

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం: మంత్రి నాదెండ్ల.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులలో తప్పులుంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్డుదారులు తమ పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గడువులోగా ఈ సవరణలన్నీ ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.

 

కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో కొన్నిచోట్ల తప్పులు దొర్లిన విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి అంగీకరించారు. ఆధార్ కార్డులలో వివరాలు అప్‌డేట్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి తమ కార్డుల్లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. త్వరలోనే ‘మన మిత్ర’ యాప్ ద్వారా కూడా సవరణలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అక్టోబర్ 31 తర్వాత కొత్త కార్డులు కావాల్సిన వారు రూ. 35 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఆ కార్డులను నవంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపిస్తామని తెలిపారు.

 

రాష్ట్రంలో 1 కోటి 45 లక్షల స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కార్డులను అందిస్తున్నారని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నారని వివరించారు. దేశంలోనే అత్యధికంగా 96.5 శాతం ఈకేవైసీ పూర్తి చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు.

 

రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రేషన్ షాపుల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే, అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోని వారి కార్డులు తాత్కాలికంగా రద్దవుతాయని, అయితే వారు సచివాలయానికి వెళ్లి సరైన కారణం తెలియజేస్తే కార్డును తిరిగి యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సామాన్యులకు అండగా నిలుస్తూ, నిజాయతీతో పనిచేస్తామని ఆయన ఉద్ఘాటించారు.