AP

గ్రామీణ రోడ్ల నిధులపై పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత కృతజ్ఞతలు!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ను మంత్రుల సమక్షంలో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులను విడుదల చేసినందుకు ఆమె ఈ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో 13 గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 18.16 కోట్ల నిధులను విడుదల చేసినందుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫేజ్–1 కింద గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఇటీవలె రూ.2,123 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర 1,229 రోడ్లను మెరుగుపరచనున్నారు. ఈ మొదటి విడతలో భాగంగా 484 మండలాల్లోని 4,007 కిలోమీటర్ల పొడవైన రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనే విమర్శలు బలంగా వచ్చిన నేపథ్యంలో, అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఇంత భారీగా నిధులను కేటాయించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడంపై దృష్టి సారించినట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.