APPOLITICSTELANGANA

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పదే పదే షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారనీ ఆందోళనకారులు ఆరోపించారు.

అయితే, టీఆర్ఎస్ కార్యకర్తలే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ తెలంగాన పార్టీ నేతలంటున్నారు. కాగా, ఉద్రిక్త పరిస్థితుల్ని అదుపు చేసే క్రమంలో వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. తాజాగా షర్మిలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆమె మొహంపై గాయాలు కనిపిస్తున్నాయి. తోపులాటలో షర్మిల గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలే దాడులు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా అధికార పార్టీకే సాయం చేశారన్నది వైఎస్ షర్మిల ఆరోపణ.