TELANGANA

తెలంగాణాను ఎడారి చేసే ప్లాన్; రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు..కీలుగుర్రం..ఎమ్మెల్సీ కవిత..!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కరువుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీ ఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తెలంగాణలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సాగునీటికి తాగునీటికి కటకట వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వదలడం లేదని ఆమె మండిపడ్డారు.

 

రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిలా మార్చేలా ఉన్నారని కవిత అసహనం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదని, కీలుగుఱ్ఱం అంటూ వ్యాఖ్యలు చేసిన కవిత, రేవంత్ రెడ్డి డిఎన్ఎ లోనే బిజెపి ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదని, బిజెపినే ఆ పని తప్పనిసరిగా చేస్తుందంటూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సమీక్ష చేయటం లేదని పేర్కొన్నారు. ఉద్యోగాల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం తీసుకొచ్చారని కవిత వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముద్ర పడే అవకాశం ఉందన్న కవిత పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యలు చేశారు.

 

మొన్న ఇచ్చిన 30 వేల ఉద్యోగాల్లో ఎంతమంది మహిళలకు వచ్చాయో చెప్పాలని కవిత ప్రశ్నించారు. పాత జీవోలు రద్దు చేసి కొత్త జీవోలు ఇస్తున్నారని కవిత వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ నియంత అని చెప్పిన మేధావులు రేవంత్ రెడ్డి ఉద్యోగాల రిజర్వేషన్లపై చేస్తున్న కుట్రలను ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని కవిత నిలదీశారు.

 

మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరమన్నారు కవిత. మాట్లాడితే అంతు చూస్తా అంటున్న రేవంత్ రెడ్డి పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. దీక్షలు చేసేందుకు అనుమతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకొని బతుకమ్మలాడిన చరిత్ర తమదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.