TELANGANA

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ

ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఇది. మొత్తం 36 నియోజకవర్గాల్లో 1,300ల కిలో మీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఆయనను సన్మానించారు రాహుల్ గాంధీ. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా వారు పార్టీ కండువాను కప్పుకొన్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సహా పలువురు పార్టీ నాయకులు ఈ సభ వేదికపై కనిపించారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ సైతం కాంగ్రెస్ నాయకులతో కలిసి వేదికను పంచుకున్నారు. మధు యాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీ హనుమంతరావు, సీతక్క.. వంటి నేతలు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ హిందీ ప్రసంగాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనువదించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను గుప్పించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా దోచుకుందంటూ మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి అనేది బీజేపీ రిష్తేదార్ సమితి మారిందంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీకీ వాటా ఉందని ఆరోపించారు.

ధరణి పోర్టల్ కింద భూములను ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్ర సమయంలోనూ ధరణి అక్రమాల గురించి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయ చట్టాలతో సహా అనేక విషయాల్లో బీఆర్‌ఎస్ బీజేపీకి బీ-టీమ్‌గా పనిచేసిందంటూ మండిపడ్డారు. మోదీ కోరినవన్నీ కేసీఆర్ అమలు చేస్తారని చురకలు అంటించారు. కేసీఆర్ రిమోట్ మోదీ వద్ద ఉందంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో – ఒక వైపు కేసీఆర్ కుటుంబం, ఆయనకు చెందిన 15 మంది సన్నిహితులు ఉంటే- మరోవైపు పేదలు, మైనారిటీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలవారు ఉన్నారని, వచ్చే ఎన్నికలు ఈ రెండు వర్గాల మధ్య యుద్ధంగా అభివర్ణించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించిన ఫలితాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని చెప్పారు రాహుల్.

తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీ-టీమ్ మధ్యే ఎన్నికల యుద్ధం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పాట్నాలో ఇటీవలే జరిగిన దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడానికి బీఆర్ఎస్ వ్యతిరేకించిందంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడిన వారందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరొచ్చని అన్నారు.