AP

ఏపీ పాలనపై ప్రధాని మోదీ ప్రశంసలకు వైఎస్‌ షర్మిల స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ఎన్డీయే పాలన భేష్‌ అని ప్రధాని మోదీ ప్రశంసించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎంపీలతో ఏపీ పాలనపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. పచ్చకామెర్లు సోకినోడి సామెతను ప్రధాని మోదీ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవని పేర్కొన్నారు.

ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ చేసిన చర్చపై ‘ఎక్స్’ వేదికగా ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి స్పందించారు. ‘ప్రధాని మోదీ తీరు పచ్చకామెర్లు సోకినోడి సామెతను తలపిస్తోంది. ఏపీలో రైతుల అవస్థలు కనపడవు. గిట్టుబాటు లేక పంటలను తగలబెడుతున్న దృశ్యాలు కనపడవు’ అని మండిపడ్డారు. ‘సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల మరణ మృదంగం కనిపించదు. ఫీజు రీయింబర్స్ చెల్లించక విద్యార్థుల కష్టాలు కనిపించవు. ఆరోగ్య శ్రీ ఆపితే రోగుల పడుతున్న రోదన కనపడదు’ అని కూటమి పాలనలోని లోపాలను ఆమె ఎత్తిచూపారు.

‘ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, విభజన హామీలను మీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, తల ఊపమంటే ఊపే గొర్రెల్లా కూటమి పార్టీలు మారాయి కాబట్టే, మోడీకి రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అనిపిస్తోంది‘ అని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన అని చంద్రబాబుపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఆమడ దూరం.. రాష్ట్ర ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని, ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతికి నిధులు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.