AP

దటీజ్ పవన్ కళ్యాణ్: కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు గంటల్లోనే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల వేగంగా స్పందించి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనను కలిసిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు, ఇటీవల ప్రపంచకప్ గెలిచినందుకు ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ. 84 లక్షల ప్రోత్సాహకాన్ని ఆటగాళ్లకు అందించారు.

అభినందనల తర్వాత, భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ సొంత గ్రామానికి (సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, హేమవతి పంచాయతీలోని తంబలహెట్టి) సరైన రోడ్డు సౌకర్యం లేక తాము పడుతున్న ఇబ్బందులను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీపిక విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా స్పందించారు మరియు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా అధికారులు వెంటనే తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ అంచనాలను డిప్యూటీ సీఎంకు అందించగా, ఆయన వెంటనే వాటికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ సాయంత్రానికే పాలనాపరమైన అనుమతులు జారీ చేసి, గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.