AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్‌ను డిస్మిస్‌ చేసింది.

 

నెల్లూరు ఏసీబీ కోర్టులో అసిస్టెంట్ పీఫీ జయశేఖర్ వాదనలు ఇలా ఉన్నాయి.. నెయ్యి సరఫరా చేస్తున్న కొంత కంపెనీల పనితీరు బాగా లేకపోతే కూడా విజయభాస్కర్ రెడ్డి వారికి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.. పనితీరు మంచిదని, నెయ్యి క్వాలిటీ సరైనది అంటూ సర్టిఫికేట్లు ఇవ్వడం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇకక, సిట్ విచారణలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు కూడా అంగీకరించారు. 2023లో భోలే బాబా కంపెనీ నుండి రూ.75 లక్షలు లంచంగా తీసుకోగా.. ప్రిమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకున్నారని.. అల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం లంచంగా తీసుకున్నట్లు కూడా గుర్తించారు.. ఇక, మొత్తం నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్ గుర్తించింది.

 

మరోవైపు, 2019-2024 వరకు విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫేవరబుల్ రిపోర్టుల కారణంగా TTD డైరీ నష్టం రూ.118 కోట్లు దాటిఉండవచ్చునని సిట్ అభిప్రాయపడుతుంది. విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుండి సిట్ అధికారులు రూ.34 లక్షలు సీజ్ చేశారు. కోర్టు ముందు ఇతని అక్రమ చర్యలను వివరించిన ఏపీపీ జయశేఖర్, నెయ్యి పరిశ్రమలో ఉన్న ఇతర సంబంధిత వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.. మొత్తంగా.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో ఇప్పుడు మరో సంచలనం వ్యవహారం బయటకు వచ్చింది.