AP

కొణిదెల గ్రామానికి మహర్దశ: పవన్ కల్యాణ్ దత్తతతో రూపురేఖలు మారుతున్న వైనం!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్, తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ నిధులను వెచ్చించి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన అందించిన రూ. 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల భారీ ఓవర్ హెడ్ ట్యాంకు పనులు పూర్తయ్యాయి. దీనివల్ల గ్రామస్థుల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

కేవలం తాగునీటికే పరిమితం కాకుండా, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను పవన్ కల్యాణ్ ఈ గ్రామానికి మంజూరు చేయించారు. ‘పల్లె పండగ’ కార్యక్రమం కింద కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కొణిదెల స్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర రూ. 4 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదల కోసం 19 ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది.

గ్రామంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి, కాలువల పునరుద్ధరణ మరియు చెక్ డ్యామ్‌ల మరమ్మతులు పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ కేవలం హామీ ఇవ్వడమే కాకుండా, వాటిని అమలు చేసి చూపిస్తుండటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి రాకముందే వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి కావడం పట్ల డిప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ, కొణిదెల గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.